కేటీఆర్, హరీష్ రావులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తానని మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 29 Sep 2023 12:31 PM GMTసీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తానని మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యుత్ కోతలు, పలు అంశాలపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 24 గంటల కరెంట్.. మీ హామీ నమ్మి లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే సగం ఎండిపోతున్నాయని అన్నారు. ఎక్కడ కూడా 14 గంటలు మించి కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. ఏ సబ్ స్టేషన్ కి రమ్మంటావో చెప్పు చర్చకు సిద్ధం అంటూ.. కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు. కరెంట్ ఇయ్యక.. వర్షాలు పడక పంటలన్నీ ఎండిపోతున్నాయని అన్నారు.
ఈ నెల రోజులైనా కరెంట్ మంచిగా ఇవ్వండని కోరారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 లక్షల మంది రైతులు ఆందోళన చెందుతున్నారని.. ఇంకో నెలలో ధాన్యం చేతికి వస్తుంది.. ఇప్పటివరకు సివిల్ సప్లై మినిస్టర్ రివ్యూ మీటింగ్ పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ని బ్యాగ్ లు, టార్పాలిన్ కవర్లు, తాలు మిషన్లు, ఐకేపీ సెంటర్ల నిర్వహణపై మీ ప్రణాళికలు ఏవి..? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు గాలికొదిలి ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలని ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు, దళితబంధు, బీసీ బంధులు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. హరీష్ రావు మీ పార్టీలో ఎం జరుగుతుందో మొదాలు చూసుకో అని హెచ్చరించారు.
9 ఏండ్లలో ఏనాడు నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం.. గ్రూప్ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక వారి ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. రెండు సార్లు గ్రూప్ పరీక్షల రద్దుతో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని అన్నారు. గ్రూప్ పరీక్షలు రాసిన ఒక్కో నిరుద్యోగ విద్యార్థికి ఒక లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 70 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా సక్రమంగా పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మర్చినప్పుడే తెలంగాణకు ఆ పార్టీ దూరమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం.. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెపుతామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీ లను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు.