Komatireddy Venkat Reddy : టీఎస్పీఎస్సీ ఛైర్మ‌న్ రాజీనామా చేయాలి : కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

టీఎస్పీఎస్సీ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీకి బాధ్య‌త వ‌హిస్తూ ఛైర్మ‌న్ రాజీనామా చేయాల‌ని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2023 2:41 PM IST
Komatireddy Venkat Reddy, Congress

విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

టీఎస్పీఎస్సీ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీకి బాధ్య‌త వ‌హిస్తూ టీఎస్పీఎస్సీ ఛైర్మ‌న్ రాజీనామా చేయాల‌ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కోమ‌టిరెడ్డి మాట్లాడారు.

టీఎస్పీఎస్సీ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిని క‌లిసి విజ్ఞ‌ప్తి చేయ‌నున్న‌ట్లు చెప్పారు. నిరుద్యోగులు చాలా క‌ష్ట‌ప‌డి కోచింగ్ తీసుకుంటున్నార‌ని, త‌ల్లిదండ్రులు వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో చ‌ద‌విస్తున్నార‌న్నారు. 30 లక్షల మంది పిల్లల భవిష్యత్ ను నాశనం చేశారన్నారు. టీఎస్సీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఆఫీసర్ గా మంచి పేరున్నా, ఇప్పుడు ఆ పరువంతా పోయిందని, స్వచ్ఛందంగా రాజీనామా చేసి, జరిగింది జరిగినట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కొద్దిపాటి పోస్టులను కూడా భర్తీ చేయలేరా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఉపాధ్యాయ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేద‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 10 వేల ఖాళీలు కాగానే డీఎస్పీ నోటిఫికేష‌న్ ఇచ్చిన‌ట్లు చెప్పారు. వడగళ్ల వానతో రైతులు న‌ష్ట‌పోతే ఎక‌రాకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే రూ.10 వేలు ఎలా స‌రిపోతాయ‌ని ప్ర‌శ్నించారు. భువ‌న‌గిరిలో డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల‌కు 4 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 2,300 మందిని అన‌ర్హులు తేల్చార‌ని మండిప‌డ్డారు.

2019 ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఫ్లోలో మాట్లాడిన మాటలు ఎవరినీ ఉద్దేశించి అనలేదని, ప్రచార సభలలో దేశంలో జరుగుతున్న సంఘటనలను ఉదాహరణగా చెప్పారని, దీనిపై కిందిస్థాయి కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించిందని, వెంటనే బెయిల్ ఇచ్చి పై కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చిందని అన్నారు. గతంలో ఎంతో మందికి కింది కోర్టులో శిక్ష పడితే పైకోర్టుల్లో స్టే తెచ్చుకున్నారని, కోర్టు సమయం ఇచ్చినా లోక్ సభ సచివాలయం తొందరపడిందన్నారు.

దేశం కోసం తండ్రిని, నాయనమ్మను కోల్పోయిన రాహుల్ గాంధీ.. దేశం ఐక్యత కోసం కష్టపడుతున్న వ్యక్తి అని అన్నారు. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి, నాలుగోసారి ఎంపీగా ఉన్న వ్యక్తిని డిస్ క్వాలిఫై చేయడం చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు. కేంద్రం వెంటనే అనర్హత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story