ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా

Komatireddy Rajagopal Reddy Resigns For MLA Post. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on  2 Aug 2022 8:14 PM IST
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని అన్నారు. నియోజకవర్గం ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటాన‌న్న ఆయ‌న‌.. నా రాజీనామాపై ఎక్కువ రోజులు నాన్చాల‌ని లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడడం కూడా తన రాజీనామాకు ఓ కారణమని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధి జరిగే పరిస్థితి లేదని.. మూడు సంవత్సరాల నుంచి మునుగోడు లో ఏ అభివృద్ధి జరగలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములు సమస్య ఉందని అన్నారు. గిరిజనులను అధికారులు వేధిస్తున్నారు. పోడు భూములకు పాస్‌ బుక్‌లు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారాయన.

నేను అమ్ముడు పోయాను అని కొందరు అంటున్నారు.. కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడు ఆ స్థాయి కి దిగజారలేదని అన్నారు. మా డబ్బులు పెట్టి పేదలకు సహాయం చేస్తున్నాం అని తెలిపారు. తప్పుడు ప్రచారం వల్ల ఒరిగేది ఏం లేదని అన్నారు. కేసీఆర్ కొన్ని వందల సార్లు టీఆర్ఎస్‌లోకి రావాల‌ని ఆహ్వానం పంపారు.. కానీ మేము వెళ్ళలేదని వెల్ల‌డించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనను మునుగోడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, కానీ, నియోజకవర్గానికి ఏం చేయలేకపోయానన్న అసంతృప్తి తనలో పేరుకుపోయిందని చెప్పారాయన. రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి, కనీస వసతులైనా కలగవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.


Next Story