షర్మిలకు నా పూర్తి మద్దతు ఉంటుంది : కాంగ్రెస్ ఎమ్మెల్యే
Komatireddy Rajagopal Reddy Comments On Sharmila Protest. కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వైఎస్సార్‌టీపీ
By Medi Samrat Published on 27 July 2021 2:48 PM GMT
కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వైఎస్సార్‌టీపీ అధినాయకురాలు షర్మిల నల్గొండలో చేపట్టిన నిరుద్యోగ దీక్షకు మద్దతు పలికి మరోమారు వార్తల్లో నిలిచారు. మంగళవారం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాజన్న బిడ్డగా షర్మిల మా నియోజకవర్గంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందని.. షర్మిల నిరుద్యోగ దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నానని అన్నారు. షర్మిలకు నా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారని.. ఉద్యోగాలను వదిలేసి కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడని ఫైర్ అయ్యారు.
వైఎస్సార్ అంటే మాకు ప్రాణమని.. బతికున్నంత వరకూ వైఎస్సార్ మా గుండెల్లో ఉంటారని అన్నారు. మునుగోడు ప్రజలకు వైఎస్సార్ ఉదయ సముద్రం ప్రాజెక్టు కట్టించారని.. ఆ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీరందించారని అన్నారు. వైఎస్సార్ 90శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే.. కేసీఆర్ ఏడేండ్లలో 10శాతం కూడా కంప్లీట్ చేయలేదని అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్సార్ కు పేరు వస్తుందని పనులు పూర్తి చేయడం లేదని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డికి ఎంతో మంది అభిమానులున్నారని.. షర్మిలను చూస్తే వైఎస్సార్‌ను చూసినట్టుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.