మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి దాదాపు ఖరారయ్యింది. ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటే రేసులో వెనుకబడ్డారు. ఇప్పటి వరకు 12వ రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తయ్యింది. దాదాపు 7వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ కొనసాగుతున్నది. మరో మూడు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. రౌండ్ల వారీగా టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం వస్తుండడంతో ఆయన నిరాశతో ఇంటిముఖం పట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తన ఓటమిని అంగీకరిస్తున్నానన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కేసిఆర్ పై ఉన్న వ్యతిరేకత స్పష్టం అవుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో పోరాటం కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల అధికారులను తెరాసా ప్రభుత్వం ప్రభావితం చేసిందని ఆరోపించారు. పోలీసులు తెరాసా కు అనుకూలంగా పని చేసారని.. తెరాస మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురి చేసి అధర్మంగా వ్యవహరించిందని విమర్శించారు. ఎన్నికల్లో అధర్మం గెలిచింది. సింబల్స్ కూడా సరిగ్గా అలాట్ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ధర్మ యుద్ధం చేసిన నన్ను.. తెరాస అధర్మంగా ఓడించిందని అన్నారు. తెలంగాణా ప్రజలు మునుగోడు పరిణామాలను ఒక సారి గమనించండి.. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుంది తెరాస.. నైతికంగా నేనే గెలిచాను.. నేను గట్టి పోటీ ఇచ్చాను.. నంబర్ గేమ్ లో నేనూ ఓడిపోయానని వ్యాఖ్యానించారు.