కేసీఆర్‌ని ఎదురించడంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy Comments On Congress. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఓడించడం బీజేపీతో సాధ్యమవుతుందని

By Medi Samrat  Published on  24 July 2022 12:53 PM GMT
కేసీఆర్‌ని ఎదురించడంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఓడించడం బీజేపీతో సాధ్యమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వ్యూహంలో తాను పావును కాదలుచుకోలేదని.. కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసి అనేక అంశాలు మాట్లాడానని, త‌మ‌ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని చెప్పారు. తాము కలలు కన్న తెలంగాణ ఎలా అయిపోయిందనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామ‌ని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎలా వచ్చిందో అమిత్ షాతో చర్చించాన‌ని చెప్పారు. అమిత్ షాతో రాజకీయాలు, రాజీనామా గూర్చి మాట్లాడలేదని అన్నారు. ఉప ఎన్నిక వస్తుందని కేసీఆర్ కులాల వారీగా, మతాల వారీగా నాయకుల గూర్చి తెలుసుకుంటున్నారని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పోయిన ప్రతిష్ఠ‌ మునుగోడు ఉప ఎన్నికల ద్వారా తిరిగి తెచ్చుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారని ఆయ‌న అన్నారు. త‌న‌పై జరుగుతున్న దుష్ప్రచారం కేసీఆర్ ఆడుతున్న నాటకమేన‌ని ఆరోపించారు. తాను అమిత్ షాను కలిసినప్పటి నుంచి కేసీఆర్‌కి నిద్ర పట్టడం లేదని అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు తప్పా మిగతా అన్ని ప్రాంతాల‌పై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని.. మిగతా నియోజకవర్గాల పై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని మండిప‌డ్డారు. మిగతా నియోజకవర్గాలు తెలంగాణలో లేవా అని ప్ర‌శ్నించారు. ఉప ఎన్నిక వస్తే నే అభివృద్ధి కి నిధులు ఇస్తారా అని నిల‌దీశారు.

కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆవేదన వ్యక్తం చేశాన‌ని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల గెలుపులో త‌న‌ పాత్ర ఉందని అన్నారు. అవమానాలు భరిస్తూనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశాన‌ని తెలిపారు. కేసీఆర్‌ని ఎదురించడంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌ని చెప్పారు. కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తున్నాన‌ని చెప్పారు. తాను పార్టీ మారాల్సి వస్తే త‌న‌ కార్యకర్తలకు చెప్పి నిర్ణయం తీసుకుంటాన‌ని అన్నారు. కేసీఆర్‌ని ఓడించడం బీజేపీతో సాధ్యమవుతుందని మాత్రమే చెబుతున్నాన‌ని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే త‌న జీవిత లక్ష్యమ‌ని తెలిపారు. ప్రజలు కోరుకుంటే రాజీనామా చేస్తాన‌ని, కేసీఆర్ పతనం మునుగోడు తీర్పుతోనే మొదలవుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీ మారే స్వేచ్ఛ త‌న‌కు ఉంద‌ని అన్నారు.

Next Story
Share it