కాంగ్రెస్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయకుండా వెంకట్‌రెడ్డి అక్టోబర్ 21న ఆస్ట్రేలియాకు వెళ్లడంపై కాంగ్రెస్ వర్గాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం ముగిసిన మరుసటి రోజే ఆయన హైదరాబాద్‌కు రావడం గమనార్హం.
తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నట్లు నియోజకవర్గ నాయకులతో మాట్లాడిన కొన్ని ఆడియోలు బయటకు రాగా.. ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో(నవంబర్ 3) వరకు సమాధానం ఇవ్వాలని తెలిపింది. మరీ షోకాజ్ నోటీసులకు ఆయన వివరణ ఇస్తారా..? అసలు ఎలా స్పందిస్తారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారా..? లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కాగా.. నోటీసులపై ఏఐసీసీ క్లీన్‌చీట్ ఇచ్చేంత వరకు ఎవరిని కలవబోరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.