పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం జరిగినప్పటినుండి తెలంగాణ కాంగ్రెస్ పుల్ జోష్‌లో ఉంది. నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యపై గళమెత్తుతూ అధికార పక్షంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూనేవున్నారు. గడిచిన ఏడేళ్లుగా మసకబారిన పార్టీ ప్రతిష్టను కొత్త పీసీసీ కార్యవర్గం కొంత గాడిలోకి తెచ్చిందనేది పొలిటికల్ సర్కిల్స్‌లో వినపడుతున్న మాట. అయితే టీపీసీసీ నేతలు ఉత్సాహంలో ఉన్న వేళ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు కోదండరెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు.
కొత్త క్రమశిక్షణ కమిటీ ఏర్పాటుకు వెసులుబాటు కల్పించేందుకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కోదండరెడ్డి రాజీనామా నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ కొత్త కార్యవర్గం రానుంది. సోనియా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి కలిగిస్తోంది. కోదండరెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు పంపారు. ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యవహారంలోనూ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు.. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కోదండరెడ్డి ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.