అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొందమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్‌ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కోదండరెడ్డి.. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. రైతు భరోసాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
త్వరలోనే రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టంపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. రుణమాఫీ జరగకపోతే ఎవరిని సంప్రదించాలో జీవోలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు.. రుణమాఫీ, మూసి డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆక్షేపించారు. రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 32 సమస్యలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ధరణి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కోదండరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయన్నారు.