చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Aug 2023 7:19 PM ISTమెగాస్టార్ చిరంజీవిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, చిరంజీవి అభిమానులకు పంచారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ చేశారు.నేను శ్రీరామ అన్నా టిడిపి, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయన్నారు. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసన్నారు. తామంతా క్లారిటీ గానే ఉన్నామని తేల్చి చెప్పారు.
రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఎవరి జోలికి వెళ్ళని పెద్దయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదన్నారు కొడాలి నాని. చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెల్లినప్పుడు చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టానన్నారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని.. తమకు ఇచ్చినట్లే డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పానన్నారు. తన వెంట ఉన్న వ్యక్తులు 60 శాతం చిరంజీవి అభిమానులేనన్నారు కొడాలి నాని.
ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కొడాలి నాని విమర్శలు గుప్పించారు. లోకేశ్ గన్నవరంలో పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయిందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తమ పార్టీ అధినేత జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బచ్చా లోకేశ్ అని.. మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయాడని గుర్తు చేశారు.