కేంద్ర కేబినెట్ మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఆయన కేంద్ర హోంశాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతిని కల్పించారు. తెలంగాణ నుంచి మొట్ట మొదటి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్ర సృష్టించారు.
కిషన్ రెడ్డి భారతీయ జనతాపార్టీలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నారు. యువమోర్చాలో కీలక పదవులు చేపట్టారు. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు. మోడీ 2.0 మంత్రివర్గంలో సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ప్రమోషన్ దక్కడం విశేషం. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.