చిరంజీవి బీజేపీలో చేరుతారనే వార్తలపై స్పందించిన కిషన్ రెడ్డి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి

By Medi Samrat  Published on  31 Jan 2024 1:05 PM GMT
చిరంజీవి బీజేపీలో చేరుతారనే వార్తలపై స్పందించిన కిషన్ రెడ్డి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చిరంజీవికి పద్మ విభూషణ్ ఇచ్చింది ఆయన బీజేపీలో చేరతారని కాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక మందికి పద్మ అవార్డులు ఇచ్చిందని, వారందరూ బీజేపీలోకి వస్తారని అవార్డులు ఇవ్వలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా పద్మ అవార్డుదారులను పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు. గుర్తింపునకు నోచుకోని కవులు, కళాకారులను గౌరవించాలన్న ఉద్దేశంతో ఇటీవల కేంద్రం పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించిందని, కొందరికి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించిందని, వారందరూ బీజేపీలోకి వస్తారని అవార్డులు ఇచ్చామన్న వాదన అర్థరహితం అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని, ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చని కిషన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ లో ఫిబ్రవరి 2న రాష్ట్ర స్థాయి బీజేపీ సమావేశం జరగనుందని కిషన్ రెడ్డి తెలిపారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణ, ప్రణాళికపై చర్చిస్తామని తెలిపారు. లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం జాతీయ స్థాయి ప్రక్రియ చేపడతామని అన్నారు. రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి ఆశావహుల పేర్లను పంపిస్తుందని, కేంద్ర నాయకత్వం పరిశీలన జరిపి అభ్యర్థులను నిర్ణయిస్తుందని అన్నారు.

Next Story