త్వరగా కోలుకోవాలి.. మరలా ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనాలి
Kishan Reddy Meet With Mandha Krishna. ఇటీవల మందకృష్ణ మాదిగ ఢిల్లీలో అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. అయితే.. ఆదివారం
By Medi Samrat Published on 5 Sep 2021 10:19 AM GMT
ఇటీవల మందకృష్ణ మాదిగ ఢిల్లీలో అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. అయితే.. ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో చర్చించాలని మంద కృష్ణ మాదిగ ఢిల్లీకి వచ్చి ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. అక్కడ ఆయనను పరామర్శించడానికి వెళితే వర్గీకరణ అంశం గురించే మాట్లాడేవారని అన్నారు. వేలాదిమంది వికలాంగులని ఏకం చేసిన వ్యక్తి మంద కృష్ణ మాదిగ అని అన్నారు. మంద కృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని అ దేవుడిని కోరుకుంటున్నానని.. మరలా ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనాలని అభిలషించారు. ఆంధ్ర, తెలంగాణాలో అయన తిరగని మండల కేంద్రాలు లేవు, మాట్లాడని సభలు లేవని.. ఆయన్ని కాపాడుకోవలసిన బాధ్యత సమాజంపైన ఉందని అన్నారు.
ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ప్రజల తరుపున నిరంతరం పోరాటం చేసే వ్యక్తి మంద కృష్ణ మాదిగ అని అన్నారు. వారు త్వరగా కోలుకోవాలని అ దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న సమయంలో కిషన్‌రెడ్డి సోదరుడిగా గొప్ప పాత్ర పోషించి తన బాధ్యత తీసుకున్నారన్నారు. అనేక కారణాలతో ఎస్సీ వర్గీకరణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ తమ మధ్య మంచి సంబంధమే ఉందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం శాసనసభలో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆ పని చేయాలని మందకృష్ణ కోరారు. రెండేళ్ల లోపు 'దళిత బంధు' పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం మందికి అమలు చేయాలని డిమాండ్ చేశారు.