అలా చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమే : కిషన్ రెడ్డి

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపరచడం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు

By Medi Samrat  Published on  24 July 2024 4:15 PM GMT
అలా చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమే : కిషన్ రెడ్డి

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపరచడం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో కోరాయని గుర్తుచేశారు. ఈ బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నారు.. అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమేన‌న్నారు. ఢిల్లీలో దీక్ష చేద్దాం.. అమరణ దీక్షలు చేద్దామనడం వాళ్ల ఆలోచనను స్పష్టం చేస్తోందన్నారు. మోదీ సర్కారు ద్వారా పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశామ‌ని. అందుకే 35శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.

కేసీఆర్ ఎలాగైతే.. వ్యవహరించాడో అదే తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నాడు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే నేటి ముఖ్యమంత్రి రేవంత్ నడుస్తుండటం.. తెలంగాణ ప్రజల దురదృష్టం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో తమ ప్రభుత్వ అసమర్థత నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇలా కేంద్రం మీద గతంలో బీఆర్ఎస్ బురదజల్లింది. ఇవాళ కాంగ్రెస్ కూడా డ్రామాలు ఆడుతోందన్నారు. కేంద్రం ఇప్పటిదాకా పదేళ్లలో 10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందన్నారు. నేను ప్రజెంటేషన్ చేశాను. దానికి సమాధానం ఉండదు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా రూపంలో 2 లక్షల కోట్లు తెలంగాణకు బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన విషయం వాస్తవాలు కాదా? అని ప్ర‌శ్నించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే నిధులను దారిమళ్లించారు. ఉపాధిహామీకి నిధులిస్తే.. ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి ఆ నిధులను దుర్వినియోగం చేశారు. పంచాయతీరాజ్ సంస్థల నిధులిస్తే.. వాటిని దారిమళ్లించారు. కనీస అవసరాలు, మౌలికవసతుల కల్పన విషయంలో ఈ నిధులు వెచ్చించకుండా పక్కదారి పట్టించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story