కాళేశ్వరం ఓ ‘హిస్టారికల్ బ్లండర్’ : కిషన్ రెడ్డి

By Medi Samrat  Published on  25 Oct 2023 3:15 PM GMT
కాళేశ్వరం ఓ ‘హిస్టారికల్ బ్లండర్’ : కిషన్ రెడ్డి

తెలంగాణలో ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని ఢిల్లీలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగి పోవడం చాలా తీవ్రమైన అంశం.. ఈ ప్రాజెక్టు నాణ్యత విషయంలో అనుమానాలు పెరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ సూపర్ ఇంజనీర్ అవతారం ఎత్తి.. ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదని గొప్పలు చెప్పుకున్నారు. ఇదేనా మీ సూపర్ ప్రాజెక్టు నాణ్యత? అని ప్ర‌శ్నించారు.

మేడిగడ్డ లోపాలతో ప్రాజెక్ట్ పైనే ఎన్నో అనుమానాలు మొదలయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారి.. ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా మారిందన్నారు. వేలకోట్లు అప్పులు తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్ట్ ఇలా నిరుపయోగంగా మారిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది.. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. పిల్లర్లు కుంగి పోతే జనం చూసి అధికారులకు చెప్పారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ ఇచ్చారు. ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేదు. నాలుగేళ్లలో 154 టీఎంసీ నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేశారు. ప్రాజెక్టులను టూరిజం సెంటర్లుగా చూపెట్టారు తప్ప ఇరిగేషన్ కు ఎక్కడా వాడుకోలేదన్నారు. రైతులకు ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమేన‌న్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాల సాగు తమ లక్ష్యం అన్నారు. ప్రజలను మోసం చెయ్యడానికి ఈ ప్రాజెక్టును ఉపయోగించారని.. అప్పులతో పనికిరాని చెత్త ప్రాజెక్ట్ ను కట్టించారని మండిప‌డ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ‘హిస్టారికల్ బ్లండర్’.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిచ్చి తుగ్లక్ డిజైన్ అని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వీళ్ల అసమర్థతతో పిల్లర్లు కుంగి పోతే.. ఎవరో కుట్ర చేశారంటూ కేసు నమోదు చేయడం హాస్యాస్పదం అన్నారు. కాళేశ్వరంపై న్యాయ విచారణకు కేసీఆర్ సిద్దమా? అని స‌వాల్ విసిరారు. అసలు ముఖ్యమంత్రి మీదే కేసు పెట్టాలన్నారు. కాళేశ్వరం విషయంలో ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గప్పాలు నరికిన కేసీఆర్ కుటుంబం.. ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు? అని ప్ర‌శ్నించారు. కేంద్ర నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. అధికారులు సరిగ్గా వివరాలు ఇవ్వడం లేదన్నారు. డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజాధనాన్ని వృధా కాకుండా డ్యాం సేఫ్టీ టీమ్ ప్రయత్నం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ అతితెలివే ఈ సమస్యకు కారణం అన్నారు. కుట్ర జరిగిందని వారి అసమర్థ నిర్ణయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని.. చేసింది తప్పని కేసీఆర్ తెలుసుకొని కేసీఆర్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.

Next Story