'త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం'.. దానం నాగేందర్‌ సంచలన కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందన్నారు.

By అంజి  Published on  12 July 2024 1:15 PM IST
Khairatabad, MLA Danam Nagender, BRS MLAs, Congress, Telangana

'త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం'.. దానం నాగేందర్‌ సంచలన కామెంట్స్

హైదరాబాద్‌: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందన్నారు. ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపాడని, కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. ఒకవేల దొరికినా.. గంటల తరబడి వెయిట్ చేయించేవారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు.

బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు.. అందుకే విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ దానం నాగేందర్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అందరికీ విలువ ఉంటుందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే దానం ఆరోపించారు. వాటి వివరాలు త్వరలో బయట పెడతానన్నారు. 10 ఏళ్లలో కేటీఆర్ బినామీలు వేల కోట్లు దండుకున్నారు.. త్వరలో సాక్ష్యాలతో బయటపెడుతానన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గంభీరం చూపిస్తున్నారని, సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా... రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Next Story