కాంగ్రెస్‌లో విజయశాంతికి దక్కిన కీలక పదవి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  18 Nov 2023 10:18 AM IST
Vijayashanti,  Congress, telangana, elections,

కాంగ్రెస్‌లో విజయశాంతికి దక్కిన కీలక పదవి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి ఆ పార్టీలో కీలక పదవి దక్కింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీల్లోనికి రాములమ్మను తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ప్రచార కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌ బాధ్యతలను విజయశాంతికి అప్పగించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి తనకు టికెట్ వస్తుందని ఆశించిన విజయశాంతికి నిరాశ ఎదురైంది. అంతేకాదు.. పార్టీలో సరైన గుర్తింపుకూడా దక్కలేదు. దాంతో.. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విజయశాంతి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి మహేశ్వరం టికెట్ ఆశించి భంగపడ్డ పారిజాతకు కూడా కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు. మొత్తం 15 మంది కన్వీనర్లను ప్రకటించింది కాంగ్రెస్.

ఈ జాబితాలో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్ అలీబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఓబెద్దుల కోత్వాల్, రామ్మూర్తి నాయక్‌తోపాటు పలువురు ఉన్నారు. కాగా.. ఇవాళ మధ్యాహ్నం విజయశాంతి మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంఇ. ఆమె ప్రెస్‌మీట్‌లో ఎలాంటి విషయాలపై మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన విజయశాంతి.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అన్నారు. కేసీఆర్ ను ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసి.. అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధం అవుతోందన్నారు విజయశాంతి.

Next Story