బీజేపీలో రాజగోపాల్‌రెడ్డికి కీలక పదవి.. రఘునందన్‌ పరిస్థితేంటీ

కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి.

By అంజి  Published on  6 July 2023 9:40 AM IST
Rajagopal Reddy, BJP, Raghunandan Rao, Telangana

బీజేపీలో రాజగోపాల్‌రెడ్డికి కీలక పదవి.. రఘునందన్‌ పరిస్థితేంటీ

రానున్న శాసనసభ ఎన్నికలు, 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు చెందిన ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది బీజేపీ అధిష్ఠానం. రాజగోపాల్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు కానీ 2022లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. ఈ ఏడాది ఆఖరులోగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్రంలో పార్టీ విస్తరణ ప్రచారంలో నిమగ్నమైన బీజేపీ హైకమాండ్ మంగళవారం తెలంగాణా కొత్త పార్టీ చీఫ్‌గా కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ని ప్రకటించింది. పార్టీలో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకే బీజేపీ ఈ మార్పులు చేసింది. ఈ క్రమంలోనే పదవుల అంశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో రఘునందన్‌ మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని, తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానని అన్నారు.

తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ శాసనసభాపక్ష నేతతో పాటు మరిన్ని పదవులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అసంతృప్తులు, అలకలకు ముగింపు పలికేందుకు.. పార్టీ శ్రేణులను పూర్తిగా ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నం చేసేందుకు సిద్ధమైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ ఇంచార్జ్‌లు తరుణ్‌చుగ్‌, సునీల్‌ బన్సల్‌.. రాష్ట్ర పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక కిషన్‌ రెడ్డి కూడా రాష్ట్ర పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి తగ్గిస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Next Story