ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అందరూ హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరిధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీకి వెళ్లి వరిధాన్యం కొనుగోలుకు డిమాండ్ చేసేందుకు కేంద్ర మంత్రులను, ప్రధానిని కూడా కలవనుంది. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలకు అనుగుణంగా లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలు చేపట్టనున్నారు. పంజాబ్ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం 100 శాతం వరి ధాన్యాన్ని సేకరిస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం నుంచి 100 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలని ఎఫ్‌సీఐని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇది జీవన్మరణ సమస్య అని, వరి ధాన్యం కొనుగోళ్లపై ఈసారి టీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర పోరాటానికి సిద్ధమవుతోందని, ఈ కార్యక్రమంలో ఆహ్వానితులందరూ పాల్గొనాలని సీఎం కోరారు.