ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. మాజీ సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్‌లకు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది....
By - అంజి |
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. మాజీ సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్‌లకు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేసిన ఇద్దరు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్‌కు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందుకు సిట్ నోటీసులు పంపించింది.
గత ప్రభుత్వ హయాంలో సీఎస్‌గా పనిచేసిన సోమేశ్ కుమార్, అదే కాలంలో ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరించిన నవీన్ చందు పాత్రపై సిట్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ)లో ఓఎస్డీగా ఎలా నియమించారన్న అంశంపై సిట్ లోతైన విచారణ చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావుకు ఎవరెవరి ద్వారా ఫోన్ నంబర్లు అందాయన్న అంశంపై సిట్ నవీన్ చందును విచారించనున్నారు.
అలాగే ట్యాపింగ్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపై కూడా ప్రశ్నలు సంధించనున్నారు. నవీన్ చందు హయాంలోనే ప్రభాకర్ రావు ఎస్‌ఐబీలో కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అదే సమయంలో పెద్ద ఎత్తున అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ట్యాపింగ్‌లో అధికార పార్టీ నేతలలోని కీలక వ్యక్తులు లక్ష్యంగా ఉన్నారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా సోమేశ్ కుమార్, నవీన్ చందులకు నోటీసులు జారీ కావడం ఈ కేసు పరిధి మరింత విస్తరిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.