హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం.. భూ పరిపానలలో సంస్కరణలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గ్రామ స్థాయి అధికారులను (వీఎల్‌వో) నియమించేందుకు ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం.. ప్రతి రెవెన్యూ గ్రామానికోక వీఎల్‌వోను నియమించనున్నారు. ఈ మేరకు సోమవారం నాడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌వో, వీఆర్‌ఏలను వివిధ శాఖల్లోకి బదలాయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారినే వీఎల్‌వోలుగా ప్రస్తుత ప్రభుత్వం నియమించనుంది.
ఈ మేరకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించి, అర్హులను గుర్తించనున్నారు. ఆ తర్వాత వారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. డిస్ట్రిక్ లెవెల్‌లో వీరి గురించి సమాచారం సేకరించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పజెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మరో నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది. ఆ తర్వాతే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. కాగా రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 7,039 వీఆర్‌వో పోస్టులకు 5,195 మంది, 25,750 వీఆర్‌ఏ పోస్టులకు 20,255 మంది పని చేసేవారు. వీరిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువుకున్న వారు ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే.