రైతు రుణమాఫీ పథకం అమలు కోసం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ పథకం అమలుకు విధివిధానాలను నిర్ణయించడానికి పీఎం కిసాన్ మార్గదర్శకాలను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
By అంజి Published on 13 Jun 2024 6:39 AM ISTరైతు రుణమాఫీ పథకం అమలు కోసం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ పథకం అమలుకు విధివిధానాలను నిర్ణయించడానికి ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం కేంద్రం అమలు చేస్తున్న కార్యాచరణ మార్గదర్శకాలను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం.. మాజీ, ప్రస్తుత ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, నెలవారీ పెన్షన్ రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఈ ప్రయోజనానికి అర్హులు కాదు.
తెలంగాణలో పంట రుణాల మాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ నిబంధనలను అనుసరించడంతోపాటు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చడంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వచ్చే వారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం.. కుటుంబానికి చెందిన ఎంత మంది సభ్యులు పంట రుణం పొందారనే దానితో సంబంధం లేకుండా, పిఎం కిసాన్ నిబంధనలను అనుసరించడం ద్వారా కుటుంబంలో ఒకరికి మాత్రమే పంట రుణమాఫీని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
పంట రుణాల మాఫీ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ఇటీవల ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. గతంలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన పంట రుణాల మాఫీ పథకాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని ఆదేశించారు. రూ. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని రేవంత్ రెడ్డి అన్నారు.
పంట రుణాల మాఫీకి అర్హతను నిర్ణయించే కటాఫ్ తేదీకి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ పథకం అమలుకు ముందు పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉంచాలి. 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రైతులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అవసరమైన నిధుల అంచనాను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.