తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీకి ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డులు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కోసం జీరో టికెట్ పొందుతున్న విషయం తెలిసిందే. చిప్‌తో కూడిన ఈ కార్డులో 16 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటోతో పాటు పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు ముద్రించి ఉంటాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారెంటీల్లో ముందుగా అమలు చేసింది ఇదే మహాలక్ష్మి పథకం. 2023 డిసెంబర్ నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్‌తో ప్రయాణిస్తున్నారు. ఆధార్ లేదా వోటర్ ఐడీ చూపిస్తే సరిపోయేది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఈ సౌకర్యం వాడుకుంటున్నారు. ఇప్పటివరకు కోట్లాది రూపాయలు ఆదా అయ్యాయి. కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండేవి – అనర్హులు వాడుకోవడం, డేటా సరిగ్గా రికార్డు కాకపోవడం లాంటివి
తాజాగా ఆర్టీసీ, ప్రభుత్వం కలిసి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుత ఆధార్ విధానాన్ని మార్చి, ప్రత్యేక చిప్ ఉన్న కార్డులు ఇవ్వనున్నారు. ఈ కార్డుల తయారీకి సుమారు 75 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం 1.5 కోట్ల మంది మహిళలకు అందజేయాలని ప్లాన్. ముందు 5 లక్షల కార్డులతో పైలట్ ప్రాజెక్ట్ చేసి, తర్వాత పూర్తి స్థాయిలో విస్తరిస్తారు