Telangana: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో కీలక మార్పులు
తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో మార్పు చోటు చేసుకుంది.
By - Knakam Karthik |
Telangana: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో కీలక మార్పులు
తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో తాజాగా కొన్ని కొత్త మార్పులు చేసింది. మొదటి, రెండు, నాలుగు విడతలు మినహా మిగిలిన మూడో విడత బిల్లుల చెల్లింపులోనే స్వల్ప మార్పులు చేపట్టింది. ఈ పథకాన్ని వీబీ జీరామ్‌జీ స్కీంకు అనుసంధానం చేయడంతో మార్పు అనివార్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా జాబ్‌కార్డు కలిగి ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించి, ఆ వేతనం డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడిస్తున్నారు.
రెండేళ్లుగా ఉపాధిహామీలో కొత్తగా చేరేవారికి జాబ్‌కార్డుల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిలో జాబ్‌కార్డులు లేనివారు ఎక్కవ సంఖ్యలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ పథకాన్ని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని చెప్పవచ్చు. వారికి ప్రత్యేకంగా జాబ్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం జాబితాలను తయారు చేసి పంపించారు. వీరిలో కొందరికి ఈ పాటికే నూతన జాబ్‌కార్డులు అందించగా, త్వరలోనే ప్రక్రియ పూర్తి చేయనున్నట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో ఇప్పటికే ఒక్కో ఇంటికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. పునాది వరకు పూర్తి చేస్తే రూ.లక్ష, గోడలు నిర్మించిన తర్వాత రూ.లక్ష, పైకప్పు వేసిన తర్వాత రూ.1.40 లక్షలు, పని పూర్తయిన తర్వాత రూ.లక్ష చొప్పున మొత్తం రూ.4.40 లక్షలు చెల్లింపులు చేయనున్నారు. తర్వాత ఉపాధిహామీ కింద రోజుకు రూ.307 చొప్పున 90 రోజులకు రూ.27,630, స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.12 వేలు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద రూ.21 వేల చొప్పున మొత్తం రూ.60 వేలను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.