సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఉద్యోగుల డీఏ చెల్లింపుతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 11 March 2024 7:00 AM IST
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఉద్యోగుల డీఏ చెల్లింపుతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. "మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. నిర్భంధాలతో పాలన కొనసాగిస్తామనుకోవడం భ్రమ, మా ప్రజా ప్రభుత్వం చర్చలు, సంప్రదంపులకు అవకాశం కల్పిస్తుంది. మీలో విశ్వాసం కల్పించడానికే చర్చలు జరిపాం" అని చెప్పారు.
మంత్రివర్గ ఉపసంఘం ఆయా సంఘాలతో చర్చలు, సంప్రదింపుల తర్వాతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ కార్మిక సంఘాల పోరాటాలతోనే సిద్దించింది. తామే సాధించామని ఏ ఒక్క రాజకీయ పార్టీ చెప్పుకున్నా అది అసంబద్ధమే అవుతుంది.
మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు చెల్లించినా ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదు. వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం. 11 వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం. 95 శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమూలమైన మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ సంకల్పించారు. అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి పాఠశాలలంటే ప్రజల్లో పూర్తి విశ్వాసం కల్పించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన అంశంపై ఎంసీఆర్‌హెఆర్డీలో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వేసవి సెలవులు ముగిసేలోగా వసతులు మెరుగుపరచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంపై విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా అధికారులకు నిర్ధేశించారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు పాఠశాలల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి చర్యల వల్ల పాఠాశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్ ఛానెల్ ద్వారా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడం, టీ-శాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ పాఠాలు చెప్పించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ కోసం ఐఎస్బీ తరహాలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు, న్యాక్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం వంటి చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించారు. సచివాలయం నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టం తీసుకొచ్చే అంశంపై సమావేశంలో చర్చించారు.