బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌!

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను త్వరలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

By అంజి  Published on  19 March 2024 8:16 AM IST
KCR, Praveen Kumar, BRS general secretary, Telangana

బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌!

హైదరాబాద్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను త్వరలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రవీణ్ కుమార్‌ను పార్టీలోకి సాదరంగా స్వాగతించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, మరే పార్టీ ఇవ్వని ప్లేస్‌ని తనకు అందజేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన కేసీఆర్.. పార్టీని పునర్నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

బీఆర్‌ఎస్ చీఫ్ కమిటీని ఏర్పాటు చేసి దాని కేడర్‌లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి టార్చ్ బేరర్‌గా మారడానికి బహుజన తత్వాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. దళితులు, బడుగు బలహీన వర్గాలను సంఘటితం చేసేందుకు పార్టీ కృషి చేస్తుందని, ఎజెండాను సిద్ధం చేశామని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఏనాడూ ఆశలు కోల్పోలేదని, ఇప్పుడు కూడా తాము ముందుకు సాగుతామని బీఆర్‌ఎస్ నేత పేర్కొన్నారు. "మీకు నమ్మకం ఉన్నప్పుడు, ఏదీ అసాధ్యం కాదు" అని కేసీఆర్‌ అన్నారు. పార్టీలోని నేతలంతా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని కేసీఆర్‌ అన్నారు. మూడు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేయడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో అర్థం కావడం లేదన్నారు.

బీఎస్పీ రాష్ట్ర శాఖ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు కేసీఆర్‌ సమక్షంలో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌తో పొత్తును విడనాడాలని బీజేపీ ఒత్తిడి మేరకు పార్టీ అధినేత్రి మాయావతి తనను కోరడంతో తాను బీఎస్పీ నుంచి వైదొలిగినట్లు మాజీ ఐపీఎస్ అధికారి తెలిపారు. మార్చి 15న కుదిరిన సీట్ల పంపకం ఒప్పందం ప్రకారం రెండు లోక్‌సభ స్థానాలను (నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌) బీఎస్‌పీకి వదిలిపెట్టేందుకు కేసీఆర్‌ అంగీకరించారు. ప్రవీణ్‌కుమార్‌ నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తారని బీఎస్పీ ప్రకటించింది.

Next Story