ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తొలి బహిరంగ సభకు ముందు యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి పూజలు చేయనున్నారు. ముగ్గురు నేతలు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో ఉదయం 11 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనానికి బయలుదేరనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది.
అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు కేసీఆర్ తన ఇద్దరు అతిథులతో కలిసి ఖమ్మం బయలుదేరి మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు పినరయి విజయన్, కేజ్రీవాల్ రెండో దశ 'కంటి వెలుగు' కార్యక్రమం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొననున్నారు. ఖమ్మం బహిరంగ సభకు పలువురు రాజకీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు విజయన్, కేజ్రీవాల్ ఇద్దరూ విజయవాడకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుండి వారు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లనున్నారు.
రేపు జరగబోయే బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్ విధివిధానాలను ఈ సభ నుంచే కేసీఆర్ ప్రకటించనున్నారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్, సీఎంల ప్రోటోకాల్‌ను మంత్రి మహమూద్ అలీ చూస్తారని, కేరళ సీఎంను రిసీవ్ చేసుకునే బాధ్యత మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రిసీవింగ్, సెండాఫ్ బాధ్యతలు అప్పగించామని హరీశ్‌రావు తెలిపారు. సీపీఐ జాతీయ నాయకులు డి. రాజాను ఆహ్వానించే బాధ్యతలు పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ చూస్తారన్నారు.