ఖమ్మం సభలో కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలి

KCR must apologise to farmers in Khammam meeting. ప్ర‌భుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించిన ఖమ్మం మిర్చి రైతులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బేషరతుగా క్షమాపణలు

By Medi Samrat
Published on : 17 Jan 2023 6:47 PM IST

ఖమ్మం సభలో కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలి

ప్ర‌భుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించిన ఖమ్మం మిర్చి రైతులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఖమ్మం మిర్చి యార్డులో తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని కొందరు పేద ఎస్టీ రైతులు ధర్నా చేస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి తప్పుడు కేసుల్లో ఇరికించింది. 10 మంది రైతులపై సెక్షన్ 307 (హత్యాయత్నం) సహా తీవ్రమైన అభియోగాలు మోపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఇలాగే చూస్తామనే సందేశం ఇచ్చేందుకే ఇలా చేశార‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఒక మీడియా ప్రకటనలో ఆరోపించారు.

జనవరి 18న అదే ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు కేసీఆర్ రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, 2017 ఏప్రిల్‌లో మిర్చిరైతుల‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని ప్రకటించాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలపై నిరసనలు చేపట్టినందుకు రైతులపై పెట్టిన కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు.

BRS ప్రభుత్వం తన పార్టీ సమావేశానికి అధికార‌ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంద‌ని.. రాజకీయ ప్రచారం కోసం ప్ర‌జ‌ల‌ డబ్బును ఖర్చు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రవాణా, భద్రతతో సహా మొత్తం ఖర్చును.. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా బీఆర్‌ఎస్‌ భరించాలని ఆయన అన్నారు. "హెలిప్యాడ్‌ల నిర్మాణం, అదనపు వాహనాల నియామకం, భద్రతా సిబ్బంది ఇతర సంబంధిత ఖర్చులు BRS పార్టీ భరించాలి" అని ఆయన అన్నారు.




Next Story