కేసీఆర్ కనబడుట లేదు.. ఆచూకీ చెబితే బహుమానమంటూ పోస్టర్లు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదంటూ పోస్టర్లు సిద్దిపేట జిల్లాలో కలకలం రేపాయి.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 5:45 PM ISTకేసీఆర్ కనబడుట లేదు.. ఆచూకీ చెబితే బహుమానమంటూ పోస్టర్లు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదంటూ పోస్టర్లు సిద్దిపేట జిల్లాలో కలకలం రేపాయి. ఈ మేరకు పోస్టర్లలో ఇలా రాసుకొచ్చారు. పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వయసు 70 ఏళ్లు, వృత్తి.. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం, బాద్యత.. గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. గుర్తులను కూడా పేర్కొన్నారు. తెల్లచొక్కా, తెల్లప్యాంట్ నెత్తిపై టోపీ, భయంకరమైన హిందువు, 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఎకరాకు రూ.కోటి సంపాదించే వ్యక్తి.. కేసీఆర్ ఆచూకీ తెలిపిన వారికి మంచి బహుమానం కూడా ఉంటుందని రాసుకొచ్చారు. గజ్వేల్‌లో ఈ పోస్టుర్లు సంచలనంగా మారాయి. ఆయన ఆచూకీ తెలిస్తే గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో తెలపాలని చెప్పారు.
కాగా.. గజ్వేల్ ఎమ్మెల్యే కనబడటం లేదంటూ స్థానిక బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడా అంటూ నినాదాలు చేశారు. గజ్వేల్ నగరంలోని పలు చోట్ల కేసీఆర్ కనబడుట లేదంటూ ఉన్న పోస్టర్లను అతికించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు బీజేపీ నేతలు.. మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగాలన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడికి రావడానికి కుదరలేదు కానీ.. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేనే కదా ఎందుకు రావడం లేదంటూ బీజేపీ నేతలు ప్రవ్నించారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ మూడు సార్లు గెలిచారనీ.. గెలిపించిన ప్రజలపై ఆయనకు ప్రేమ లేదని అన్నారు. గజ్వేల్‌లో గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కేసీఆర్ కనపడలేదనీ అందుకే ఆయన మిస్సింగ్ అంటూ పోస్టర్లు వేశామని స్థానిక బీజేపీ నేతలు చెప్పారు.