తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్‌ను కలెక్టర్ ఛాంబర్‌లోని సీటులో కూర్చోబెట్టారు. అంతకుముందు కలెక్టరేట్‌లో జిల్లా పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని పెద్దకల్వల ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్పీ క్యాంపు స్థలంలో 22 ఎకరాల్లో ప్రభుత్వం రూ.48.07 కోట్లతో అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించింది.
ఈ భవనంలో ఆరు బ్లాకులు, 98 గదులు ఉన్నాయి. కింది అంతస్తులో 40, మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 29 గదులు నిర్మించారు. భవన సముదాయంలో 41 శాఖల కార్యాలయాలు ఉండగా.. గ్రౌండ్ ఫోర్‌లో సంక్షేమశాఖ, మత్స్యశాఖ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. మరో ఎనిమిది మంది జిల్లా స్థాయి అధికారులకు నివాస గృహాలను కూడా సిద్ధం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.