బొజ్జల మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

KCR expresses grief over passing away of Bojjala Gopala Krishna Reddy. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల తెలంగాణ

By Medi Samrat  Published on  6 May 2022 12:30 PM GMT
బొజ్జల మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచి మిత్రుడిని కోల్పోయామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు రోజు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కూడా పార్టీ సీనియర్ నేత మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ ఓ రత్నాన్ని కోల్పోయిందని అన్నారు. ఏప్రిల్ 15న చంద్రబాబు నాయుడు సీనియర్ నేత చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి బొజ్జ‌ల‌ ఆరోగ్యంపై ఆరా తీసేవారు. టీడీపీ అధినేత పలు సందర్భాల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయ‌న‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

మాజీ మంత్రి, సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పనిచేశారు. గోపాలకృష్ణ రెడ్డి మరణంపట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని రామకృష్ణ తెలియజేశారు.
















Next Story