జైలు నుంచి విడుద‌లైన ఎమ్మెల్సీ క‌విత‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో బెయిల్ పొందిన ఎమ్మెల్సీ క‌విత కొద్దిసేప‌టి క్రితం జైలు నుంచి విడుద‌ల‌య్యారు

By Medi Samrat  Published on  27 Aug 2024 9:31 PM IST
జైలు నుంచి విడుద‌లైన ఎమ్మెల్సీ క‌విత‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో బెయిల్ పొందిన ఎమ్మెల్సీ క‌విత కొద్దిసేప‌టి క్రితం జైలు నుంచి విడుద‌ల‌య్యారు. 166 రోజుల త‌ర్వాత‌ జైలు నుంచి విడుద‌లైన ఆమె కొడుకును, భ‌ర్త‌ను హ‌త్తుకుని భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను కేసీఆర్ బిడ్డ‌నని.. త‌ప్పు చేయ‌న‌న్నారు. అన‌వ‌స‌రంగా త‌న‌ను జ‌గ‌మొండిగా మార్చార‌న్నారు. 18 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలను చూశాన‌ని.. న‌న్ను ఇబ్బంది పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లిస్తానని వ్యాఖ్యానించారు. ఐదు నెలల పాటు తన కుటుంబానికి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చిన కవిత.. తనకు అండగా నిలబడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఢిల్లీల్లో విశ్రాంతి తీసుకోనున్న క‌విత రేపు హైద్రాబాద్‌కు రానునున్నారు. ఇదిలావుంటే.. ఎమ్మెల్సీ క‌విత విడుద‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగ‌ళ‌వారం ఎట్టకేలకు ఊరట లభించింది. కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత, ఈడీ తరఫున వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కవితను అరెస్ట్ చేసినట్లు అప్పట్లో ఈడీ ఉన్నతాధికారులు చెప్పారు. అరెస్ట్ వారెంట్‌తో వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి.. ఆ తర్వాత విచారించారు. వాంగ్మూలం తీసుకున్నారు. ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని.. అదుపులోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత జైలులోనే ఉన్నారు. బెయిల్‌ కోసం అన్నివిధాలా ప్రయత్నించారు. కానీ.. న్యాయస్థానాలు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూనే వచ్చాయి. కానీ.. సుప్రీంకోర్టు మంగళవారం ఎట్టకేలకు బెయిల్‌ను మంజూరు చేసింది.

Next Story