తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చారని, కాగ్ నివేదిక ద్వారా రాష్ట్ర ఆర్థిక విధ్వంసం బట్టబయలైందని ఆమె మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు సంపద పెంచుతామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్, ఏడాది కాలంలో ఏకంగా రూ.1.30 లక్షల కోట్ల చేబదులు అప్పులు తెచ్చిందని ఆరోపించారు.
నెలకు రూ. 12 వేల కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ కనీస నిల్వలు కూడా నిర్వహించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనమేనని, ఒక్కో కుటుంబంపై దాదాపు రూ. 9 లక్షల అప్పు భారం మోపారని ధ్వజమెత్తారు. మిగులు బడ్జెట్ అని ప్రజలను దగా చేయడం మానేసి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అకాల వర్షాలతో జగిత్యాల, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందించాలని కవిత కోరారు.