హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా.. మహిళలకు ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎన్నికల వాగ్దానాల అమలు కోసం డిమాండ్ చేస్తూ ప్రజా భవన్ ఎదుట పెద్ద ఎత్తున మహిళలతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు.
మహిళలకు నెలకు ఇవ్వాల్సిన ₹2,500 నగదును వెంటనే విడుదల చేయాలి. వృద్ధులు, దివ్యాంగులకు హామీ ఇచ్చిన విధంగా ₹4,000 పింఛన్ అమలు చేయాలి. కేవలం నగదు మాత్రమే కాకుండా, హామీ ప్రకారం తులం బంగారం కూడా ఇవ్వాలి. కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేయాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..అని కవిత కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.
రాబోయే బడ్జెట్‌లో ఈ పథకాలన్నింటికీ నిధులు కేటాయించకుంటే, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్‌ను మహిళలు నిలదీసే రోజు దగ్గరలోనే ఉందని కవిత హెచ్చరించారు. అంగన్‌వాడీల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.