ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. కవిత, అరవింద్ నిజామాబాద్ కు ఏమీ చేయలేదు

నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్ లు, రాత్రి సమయాల్లో గ్రౌండ్ మీటింగ్ లు, ఇంటింటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 May 2024 12:30 PM IST
ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. కవిత, అరవింద్ నిజామాబాద్ కు ఏమీ చేయలేదు

నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్ లు, రాత్రి సమయాల్లో గ్రౌండ్ మీటింగ్ లు, ఇంటింటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో మండే ఎండలో కూడా నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎంతో మంది నాయకులు రైతులను కలుస్తుండగా, రైతులు పొలాల్లో గడ్డి కుప్పలు సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీల ఏర్పాటు డిమాండ్ గత 10 సంవత్సరాలుగా నిజామాబాద్‌లో ప్రధాన ఎన్నికల అంశంగా కొనసాగుతోంది.

నిజామాబాద్ ఓటర్లకు పసుపు బోర్డు, చక్కెర కర్మాగారాలు కీలక డిమాండ్స్:

పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై స్పష్టత రాకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం పునఃప్రారంభించాలని చెరకు రైతులు కూడా కోరుతున్నారు. ఈ రెండు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఓటర్లు కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. న్యూస్‌మీటర్‌తో మాట్లాడిన జీవన్ రెడ్డి.. చక్కెర ఫ్యాక్టరీ స్థాపనపై పార్టీ నిర్ణయాన్ని, ఈ ప్రాంతంలోని ఓటర్ల డిమాండ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇద్దరు ఎంపీలు.. భారత రాష్ట్ర సమితికి చెందిన కె కవిత, సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని.. కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేరుస్తుందన్న భరోసాతో ఆయన ప్రజలకు చేరువవుతున్నారు.

న్యూస్ మీటర్: నిజామాబాద్‌లో గత పదేళ్లుగా పసుపు బోర్డు కావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్య ప్రస్తుత స్థితి ఏమిటి?

జీవన్ రెడ్డి: పసుపు బోర్డు సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఐదేళ్ల క్రితం, సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రజలకు ఐదు రోజుల్లో పసుపు బోర్డు, జొన్నలకు మద్దతు ధర ఇస్తామని బాండ్ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో కూడా తాను గెలిస్తే పసుపు బోర్డు నిజామాబాద్‌కు తెస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ అదే వాగ్దానం ఎందుకు చేస్తున్నారు? ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదనడానికి ఆయన మాటలే నిదర్శనం.

న్యూస్ మీటర్ : ఇక్కడి రైతుల నుండి మీకు ఎలాంటి స్పందన వస్తోంది?

జీవన్ రెడ్డి: అబద్ధపు హామీలతో రైతులు కలవరపడుతున్నారు. ఎట్టకేలకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. క్వింటాల్‌కు రూ.15వేలు లభిస్తుండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ బోర్డు వారికి చాలా అవసరం.. వీలైనంత త్వరగా దానిని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

న్యూస్ మీటర్: ప్రజలు అడిగే ప్రధాన ప్రశ్న చక్కెర కర్మాగారాల గురించి. చక్కెర కర్మాగారాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా?

జీవన్ రెడ్డి: 2001- 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటీకరించాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, సి విద్యాసాగర్‌రావు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే ఇది జరిగింది. షుగర్ ఫ్యాక్టరీలో 51 శాతం వాటాలను అప్పటి టీడీపీ-బీజేపీ ప్రభుత్వం విక్రయించింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత చక్కెర కర్మాగారాలు పుంజుకుంటాయని అందరూ భావించారు. ప్రైవేటీకరించిన చక్కెర కర్మాగారాలను మళ్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని భావించారు.

దురదృష్టవశాత్తు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఫ్యాక్టరీలను పూర్తిగా మూసివేశారు. 2015లో పూర్తిగా మూతపడ్డాయి. కవితపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ ధర్మపురి హామీ ఇచ్చినట్లు చేస్తారనే నమ్మకంతో వారు ఆయనకు ఓటు వేశారు. ఆయన ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లారో కూడా చూడలేదు. చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని, పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. పాపం అరవింద్ కూడా కవిత జాడలోనే నడిచాడు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు హామీ ఇచ్చింది. చక్కెర కర్మాగారాల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే మధ్యంతర నివేదిక కూడా ఇచ్చింది. చక్కెర కర్మాగారాల పునఃప్రారంభ తేదీ డిసెంబర్ 2025 అని హామీ ఇస్తున్నాను. మెట్‌పల్లి, బోధన్, మంబోజి పల్లెలోని మూడు చక్కెర కర్మాగారాలు పునరుద్ధరించనున్నారు. 51 శాతం వాటాదారులు చెల్లించాల్సిన బ్యాంకర్ల బకాయిలను ప్రభుత్వం రూ.43 కోట్లు చెల్లించింది. చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించే క్రమంలో భాగాంగానే ఇది జరిగింది. ఏడాదిన్నరలోగా చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించబోతున్నాం.

న్యూస్ మీటర్ : నేను మీకు ఓటు వేయనని చెప్పినప్పుడు ఒక మహిళను కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఎందుకు అలా చేశారు?

జీవన్ రెడ్డి: లేదు, నేను ఆమెను చెంపదెబ్బ కొట్టలేదు. నేను ఆమెకు నా ఆశీస్సులు మాత్రమే ఇస్తున్నాను. ఆ తర్వాత అదే మహిళ ఓ వీడియో ద్వారా ప్రజలకు క్లారిటీ ఇచ్చింది.

న్యూస్ మీటర్ : నిజామాబాద్‌లో మీ అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా ప్రకటించింది. నిజామాబాద్‌లోనూ ఓట్ల పోలరైజేషన్‌ జరిగినట్లు తేలింది. మీరు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు?

జీవన్ రెడ్డి: బీజేపీ పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది కానీ నిజామాబాద్ ప్రజలు సెక్యులర్. చాలా తెలివైనవారు. హిందువులు, ముస్లింలు రాజకీయ పార్టీల విధానాల ప్రకారం ఓటు వేస్తారు తప్ప మతం ఆధారంగా కాదు. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో రైతులు ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలకు ఇక్కడి ప్రజలకు ముఖ్యమైనది. వ్యవసాయ సంక్షోభం నుండి బయట పడాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు రావాలని ఆశిస్తూ ఉన్నారు.

Next Story