ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. కౌశిక్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌశిక్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇదిలావుంటే.. కౌశిక్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడిని అయ్యాను. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
ఇక కౌశిక్ రెడ్డి ఆడియో టేపు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం విదితమే. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను వివరణ కోరడం.. ఆ తర్వాత కౌశిక్ పార్టీకి గుడ్ బై చెప్పేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో అయితే చేరాడు గానీ.. ఉపఎన్నికలో ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇస్తారా..? ఇవ్వరా..? అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.