టీకాంగ్రెస్‌లో 'కత్తి కార్తిక' చేరబోతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమక్షంలో జులై16న గాంధీ భవన్‌లో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరనున్నారు. తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున కత్తి కార్తిక పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలో ఆమెకు 363 ఓట్లు వచ్చాయి.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన కత్తి కార్తిక తొలుత రేడియో జాకీగా పని చేశారు. ఆ తర్వాత ఓ తెలుగు ఛానల్‌లో యాంకర్‌గా పనిచేశారు. దుబ్బాక ఎన్నికల తర్వాత కొంత కాలంగా రాజకీయాల్లో సైలెంట్‌గా ఉంటున్న ఆమె తాజాగా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. టీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి ఇటీవల బడా నేతలను పార్టీలో చేర్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.