సీఎం కేసీఆర్ గెలుపోటములపై జోస్యం చెప్పిన కర్ణాటక సీఎం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరు మీద ఉంది. పలువురు కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో
By Medi Samrat Published on 10 Nov 2023 1:00 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరు మీద ఉంది. పలువురు కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో మాట్లాడుతూ.. అవినీతి డబ్బుతో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఓడిపోతారని సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని సిద్దరామయ్య ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో అవినీతి రాజ్యమేలిందని.. తమ ఓటు హక్కుతో కేసీఆర్ ను ఇంటికి పంపాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని సిద్దరామయ్య చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విమర్శలు గుప్పించారు సిద్ధరామయ్య. మోదీని నమ్ముకున్న కర్ణాటక బీజేపీ నేతలు తలలు పట్టుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో కర్ణాటకలో మోదీ అన్ని సార్లు ప్రచారం చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్దాల కోరు అని విమర్శించారు. ఇలాంటి అబద్దాల కోరు ప్రధానిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. దళితులు, వెనుకబడినవర్గాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని సిద్దరామయ్య విమర్శించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీ స్కీమ్ ను అమలు చేయలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేసీఆర్ విమర్శలు చేశారన్నారు. కానీ,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.