వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరీంనగర్ మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కళాశాల 100 మంది విద్యార్థులతో ప్రారంభమవుతుందని.. విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు ఈ సంవత్సరం ఆగస్టు నుండి ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. మంగళవారం కరీంనగర్ పట్టణ శివారులోని కొత్తపల్లిలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆవరణలో వైద్య కళాశాలకు సంబంధించి తాత్కాలిక భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు.
పట్టణంలో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కరీంనగర్‌కు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు లకు మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలిపారు.
వీలైనంత త్వరగా తరగతులు ప్రారంభించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి రూ.7కోట్లు మంజూరు చేశారని, విత్తనాభివృద్ధి సంస్థ ఆవరణలో వైద్య కళాశాలకు 25 ఎకరాల స్థలంతో పాటు నాలుగు గోదాములను కూడా కేటాయించారని తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇక్కడ రెండు లెక్చర్ హాళ్లు, సెంట్రల్ లైబ్రరీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లను తాత్కాలికంగా అభివృద్ధి చేయనున్నామని, శాశ్వత భవనానికి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని చెప్పారు.