తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులు 10 లక్షలకు చేరుకోవడం పట్ల టీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్‌లో స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ సమాజం మార్పుకు జ్యోతి ప్రజ్వలన చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన పథకం కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు.. వారి కుమార్తెల పెళ్లి చేసేందుకు ఆసరాగా ఉండేందుకు ఓ విజన్‌తో ఈ పథకం ప్రారంభించబడిందని ఆమె ట్వీట్ చేశారు.
దేశంలోనే తొలిసారిగా 2014లో ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వివాహానికి సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సాయంతో, తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లి చేసే స్థితి నుండి ఆనందంగా పెండ్లి చేసే పరిస్థితి పేద కుటుంబాల్లో ఏర్పడిందని కవిత మరో ట్వీట్ చేశారు. కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ₹1,00,116 సహాయం అందిస్తుంది. ఈ పథకం బాల్య వివాహాలను నిరోధిస్తుంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలిక.. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹2 లక్షలకు మించకుండా ఉన్న ఏ కమ్యూనిటీకి చెందిన వారైనా ఈ పథకానికి అర్హులు.