భట్టిపై అభ్య‌ర్ధిని పెట్టడానికి కేసీఆర్ మూడు నిద్రలేని రాత్రులు గడిపారు : కల్వకుంట్ల రమ్య రావు

భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు

By Medi Samrat  Published on  21 Nov 2023 2:32 PM IST
భట్టిపై అభ్య‌ర్ధిని పెట్టడానికి కేసీఆర్ మూడు నిద్రలేని రాత్రులు గడిపారు : కల్వకుంట్ల రమ్య రావు

భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు కల్వకుంట్ల రమ్యరావు.. భట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రాబోతుంద‌న్నారు. భట్టి విక్రమార్కకు వైయస్సార్ లాంటి గొప్ప పదవి రాబోతున్నదని జోస్యం చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని భట్టి విక్రమార్క.. వైయస్సార్ మాదిరిగా తెలంగాణలో పాదయాత్ర నిర్వహించార‌ని పేర్కొన్నారు.

మండుటెండలో తల మాడిన, జ్వరం వచ్చిన, కాళ్ళు బొబ్బలెక్కిన, ప్రజలే నా ప్రాణమని, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు భట్టి విక్ర‌మార్క అని కొనియాడారు. నాలుగు కోట్ల ప్రజలు బాగుపడడమే నా ధ్యాస, శ్వాస అని పాదయాత్ర చేసిన మహనీయుడు భట్టి అని కీర్తించారు. నాటి వైయస్సార్ మరో రూపమే నేటి భట్టి విక్రమార్క అని పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు వైఎస్ఆర్ సేవలందించినట్టుగా, కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టుగా, తెలంగాణ ప్రజలకు భట్టి సేవలందిస్తారు. కార్యకర్తలకు భరోసాగా నిలుస్తారని అన్నారు. భట్టి విక్రమార్క గెలవడం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అందుకే ప్రచారానికి వచ్చానన్నారు. ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క ప్రచార రథంపైన కిలోల కొద్ది బంతిపూల వర్షం కురిపించినట్టూ.. మీ ఓట్లు వరద కురిపించాలన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి కానుకగా ఇద్దామ‌న్నారు. కారు పార్టీవి కారు కూతలు.. ప్రజలను మభ్యపెట్టే మాటలని ర‌మ్య‌రావు అన్నారు. మధిరలో భట్టికి పోటీ ఇచ్చే స్తాయి కమల్ రాజుకు ఉన్నదా? అని ప్ర‌శ్నించారు. మధిరలో భట్టికి పోటీ లేరు, సాటి లేరు అని అన్నారు. భట్టిపై పోటీ పెట్టడానికి కేసీఆర్ మూడు నిద్రలేని రాత్రులు గడిపార‌న్నారు. ఎంత ఆలోచన చేసినా పోటీకి నిలబ‌డానికి ఎవరు దొరకకపోవడంతో బోడి లింగాల్లో.. ఈడో లింగాన్ని నిలబెట్టిండని.. మధిరలో కేసీఆర్ నిలబెట్టిన లింగం.. పడిపోయే లింగమే అని ఎద్దేవా చేశారు.

Next Story