కాంగ్రెస్ సర్కార్ ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు భారాన్ని మోపింది: కవిత
తెలంగాణ బడ్జెట్‌పై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
By - Knakam Karthik |
కాంగ్రెస్ సర్కార్ ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు భారాన్ని మోపింది: కవిత
తెలంగాణ బడ్జెట్‌పై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'ఫేక్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్'గా అభివర్ణించారు. ఈ ప్రభుత్వం ఒక్కో కుటుంబంపై ఏకంగా రూ. 9 లక్షల అప్పు భారాన్ని మోపిందని, లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని ఆమె మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు ఇలా అందరినీ ఈ ప్రభుత్వం వంచించిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెప్పడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారని, అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వమని కవిత ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయనకు ‘రాహుల్ ఫేక్’ అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. "మా హైదరాబాదీ సలీం ఫేక్ తన అబద్ధాలతో కనీసం ప్రజలను నవ్విస్తాడు.. కానీ రాహుల్ ఫేక్ మాత్రం తన అబద్ధాలతో తెలంగాణ ప్రజలను ఏడిపిస్తున్నాడు" అని విమర్శించారు.
ప్రభుత్వం చెబుతున్న ‘రైజింగ్ తెలంగాణ’ అంటే నిరుద్యోగంలో రైజింగ్ అవ్వడమేనని, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి మోడీని ‘బడే భాయ్’ అని మొక్కినా రాష్ట్రానికి వంద రూపాయలు కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 4 శాతం నిధులే ఇచ్చారని, తెలంగాణ ఉద్యమకారులను కూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.