కేసీఆర్‌ ధనదాహంతో ప్రాజెక్టు బొందలగడ్డగా మారింది: సీఎం రేవంత్‌

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి ట్విటర్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ధనదాహంతో లక్ష కోట్లు గుమ్మరించి కట్టిన ప్రాజెక్టు ఇవ్వాళ బొందలగడ్డగా మారిందన్నారు.

By అంజి  Published on  14 Feb 2024 12:33 AM GMT
Kaleshwaram project, damage, KCR, CM Revanth, Medigadda, Telangana

కేసీఆర్‌ ధనదాహంతో ప్రాజెక్టు బొందలగడ్డగా మారింది: సీఎం రేవంత్‌

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి ట్విటర్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ''మేడిగడ్డకు ఎందుకుపోయారు..? ఏముంది అక్కడ బొందల గడ్డనా..!? అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. నిజమే… కేసీఆర్ ధనదాహంతో లక్ష కోట్లు గుమ్మరించి కట్టిన ప్రాజెక్టు ఇవ్వాళ బొందలగడ్డగా మారింది'' అని అన్నారు.

''తొమ్మిదిన్నరేళ్ల క్రితం తెలంగాణను పచ్చగ చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి, కాంగ్రెస్ ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత - చేవేళ్ల డిజైన్లు మార్చి.. కాళేశ్వరం పేరుతో కమీషన్లు బొక్కి కేసీఆర్ సృష్టించిన విధ్వంసం ఇవ్వాళ మేడిగడ్డ రూపంలో కళ్లముందు కనిపిస్తోంది. కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల నమ్మకం. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు నాలుగు కోట్ల ప్రజల ఆశలు. ఈ నేరానికి శిక్ష తప్పదు. ఈ ఘోరం కళ్లారా చూసి.. తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నమే.. సహచర మంత్రులు, శాసనసభ్యులతో కలిసి ఇవ్వాల్టి మేడిగడ్డ పర్యటన'' అంటూ రేవంత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

బీఆర్‌ఎస్‌ను బీజేపీ కాపాడాలని చూస్తోందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. బీజేపీ నేతలు మేడిగడ్డకు ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ మేడిగడ్డకు రాలేదని, కేసీఆర్‌ అవినీతిని ఆ పార్టీ సమర్థిస్తోందా? లేదా నిలదీస్తోందా? అని ప్రశ్నించారు. తాము జ్యుడీషియల్‌ విచారణకు నిర్ణయిస్తే బీజేపీ సీబీఐ విచారణను డిమాండ్‌ చేస్తోందని, నిన్న వరంగల్‌ వచ్చిన కిషన్‌ రెడ్డి మేడిగడ్డకు ఎందుకు రాలేదు? అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు.

Next Story