మీలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయాడా..? ఈటెలపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
Kadiam Srihari Press Meet. అధికారంతో సంబంధం లేకుండా దాదాపు 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో వున్నానని మాజీ
By Medi Samrat Published on 15 Jun 2021 8:55 AM GMT
అధికారంతో సంబంధం లేకుండా దాదాపు 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో వున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈటెల పార్టీ మార్పుపై పలు కామెంట్స్ చేశారు. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగతమని.. అయితే ఈటెల వామపక్ష సిద్దాంతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
పార్టీ అధ్యక్షుడు కాకుండా.. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మరో వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడం ఏంటి..? ఈటెల ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీలో చేరారని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. పేద ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా బీజేపీ దాడి చేసిందని అన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏంటి.? నీలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయాడా..? ఏం ఉద్ధరించడానికి ఆయన బీజేపీలో చేరారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ పై ఈటెల వాడిన భాష సరిగా లేదని.. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న ఆయన ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు. ఐదు సంవత్సరాల క్రితమే సీఎంతో మనస్పర్థలు వస్తే.. ఇప్పుడు నీకు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా.. అని ప్రశ్నించారు. దాదాపు 26 లక్షల రూపాయల రైతు బంధు లబ్ధీ పొందిన ఈటెల.. రైతు బంధు గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారు.. కేసులకు భయపడే ఈటెల బీజేపీలో చేరారని కడియం శ్రీహరి విమర్శించారు.