తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని చూసేందుకు తాను వెళ్తానంటే వద్దన్నారని.. సచివాలయం వద్దని తాను అనుకున్నానని అన్నారు. దేవుడు కూడా అనుకున్నాడని, అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పారు. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా గెలవలేరని, అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారా? అని విమర్శించారు. కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజున కాకుండా అంబేద్కర్ పుట్టినరోజున ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నాడు తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న కాకుండా అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న కొత్త సెక్రటేరియట్ ప్రారంభించేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తానన్న కేఏ పాల్.. ప్రతివాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీలను చేర్చారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పట్టారని ఆయన జయంతి రోజునే దాన్ని ప్రారంభించడం సముచితమని పాల్ కోరుతున్నారు.