కాబోయే ముఖ్యమంత్రిని నేనే : కేఏ పాల్
KA Paul Fire On Police. మునుగోడు ఉప ఎన్నికలో కేఏ పాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 22 Oct 2022 3:59 PM ISTమునుగోడు ఉప ఎన్నికలో కేఏ పాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..! మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయనను.. అధికారులు అడ్డుకున్నారు. అధికారులు కేఏ పాల్ వాహనాన్ని అడ్డుకోగా, ఆయన వారిపై ఎక్కడలేని కోపాన్ని తెచ్చుకున్నారు. చండూరులో ప్రజాశాంతి పార్టీకి చెందిన రెండు ప్రచార వాహనాలు ముందు వెళుతుండగా, వాటి వెనుక కేఏ పాల్ వాహనం వస్తోంది. కేఏ పాల్ వాహనాన్ని అధికారులు నిలిపివేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్.. నన్నే ఆపుతారా.. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? నేను తెలంగాణకు కాబోయే సీఎంను.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ తన ఫాలోవర్ అని, తాను అనుమతి తీసుకునే ప్రచారం చేస్తున్నానని స్పష్టం చేశారు. తనను ఆపిన అధికారిని నీ పేరేంటని ప్రశ్నించారు. ఆ అధికారి చెప్పకపోయేసరికి మెడలోని ఐడీ కార్డు పట్టుకుని అందులోని పేరును చూసే ప్రయత్నం చేశారు. ఇతర అధికారులు జోక్యం చేసుకుని కేఏ పాల్ కు సర్దిచెప్పడంతో ఈ వ్యవహారం అంతటితో ముగిసింది. కేఏ పాల్ అక్కడ్నించి వెళ్లిపోయారు. ఏది ఏమైనా మునుగోడులో పాల్ తనదైన శైలిలో వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.