తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయంలో ఇటీవల అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన పిల్ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు పాల్ తెలిపారు. ఈ క్రమంలోనే స్పందించిన సీజే కేఏ పాల్ పిల్‌కు నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టార్‌ను ఆదేశించారు. ఇక అంతకు ముందు కూడా సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడు కాకుండా అంబేద్కర్ పుట్టినరోజున సచివాలయాన్ని ప్రారంభించాలని ఆదేశించాలని కేఏ పాల్ పిటీషన్ వేశారు.
"నిర్మాణంలో ఉన్న సచివాలయం చూసేందుకు తాను వెళ్తానంటే అడ్డుకున్నారని.. తాను వద్దన్నానని, దేవుడు కూడా వద్దని అనుకున్నాడని.. అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పుకొచ్చారు. తనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడని" కేఏ పాల్ అన్నారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదని అన్నారు.