బహిరంగ చర్చకు సిద్ధ‌మా.. సీఎం కేసీఆర్‌కు కేఏ పాల్ సవాల్

KA Paul challenges CM KCR. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ బహిరంగ సవాల్ విసిరారు.

By Medi Samrat  Published on  26 Oct 2022 3:30 PM IST
బహిరంగ చర్చకు సిద్ధ‌మా.. సీఎం కేసీఆర్‌కు కేఏ పాల్ సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ బహిరంగ సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చినవో చెప్పాకే మునుగోడుకు రావాల‌ని అన్నారు. నేను మునుగోడు లోనే ఉన్న.. దమ్ముంటే మునుగోడులో బహిరంగ చర్చ కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్..? అంటూ స‌వాల్ విసిరారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో నిన్న భారత్ ఎలా గెలిచిందో.. మునుగోడులో జరగబోయే యుద్ధంలో గెలుపు నాదేన‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగల పీల్చుకు తింటున్న కేసీఆర్, ఆయ‌న‌ దండుపాళ్యం ముఠాను ఓటుతో తరిమికొట్టండని మునుగోడు ప్ర‌జ‌ల‌ను కోరారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు, తెలంగాణ ప్రజల భవిష్యత్ కు మార్పు అవ్వాలని అన్నారు. చండూరు మండల కేంద్రంలో జరిగిన రోడ్ షోకు హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. మునుగోడుపై కేసీఆర్, కెసిఆర్ చెడ్డి గ్యాంగ్ వచ్చింది. దోచుకునేందుకు సిద్ధమైంది. మందు, మాంసం, మనీ తో ఓట్లు దండుకునేందుకు సిద్దమైన గ్యాంగ్ కు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. యావత్ తెలంగాణ ప్రజల రక్తం పీల్చి దోచుకున్న సొమ్ముతోనే కేసీఆర్ ఓట్లు కొంటున్నడు, కోట్లు కుమ్మరిస్తున్నాడు. బిజెపి, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి వారు పంచే ప్రతి రూపాయి మన సొంత డబ్బే, ఆ డబ్బులన్నీ మనవే.. తీసుకోండని పిలుపునిచ్చారు.

ఎంతోమంది ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఫేక్ హామీలెన్ని నెరవేర్చినవో సమాధానం చెబితేనే కేసీఆర్ ను మునుగోడులో తిరగనియ్యండి.. లేదంటే తరిమి కొట్టండని అన్నారు. అసెంబ్లీలో అడుగు పెడతా, పట్టపగలే చుక్కలు చూపిస్తాన‌ని.. ప్రజా సమస్యలపై గళం విప్పుతాన‌ని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తిన్న కోట్ల రూపాయల్ని కక్కిస్తాన‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

మునుగోడు ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి.. తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్దేశించే ఎన్నిక ఈ మునుగోడు ఎన్నిక. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆత్మగౌరవ ఎన్నిక ఇది. కర్షకులకు, కార్పొరేట్ నాయకులకు మధ్య జరిగే పోరాటం. నిలువనీడలేకుండా బతుకులీడుస్తున్న పేదల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఇదని పేర్కొన్నారు.

కేసీఆర్ ఎన్నికల్లో ప్రకటించిన హామీల్లో ఒకటి.. ఇంటికో ఉద్యోగం.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు శ్వేతపత్రం విడుదల చేయాలి? ఎన్నికల హామీల్లో ఇస్తా అన్న నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు.. దళిత బంధు ఎంతమంది దళితులకు ఇచ్చావు? అని ప్ర‌శ్నించారు. ఫాంహౌజ్ లో పెగ్ వేసి పడుకొనే కేసీఆర్ కి ప్రజా సమస్యలు ఏమి తెలుసున‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనలో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా చలనం లేని నీచుడు కేసీఆర్.. అని తీవ్రవిమ‌ర్శ‌లు చేశారు. ఉన్న రాష్ట్రంలో సమస్యలు తీర్చడం చేతకాని కెసిఆర్ దేశాన్ని వెలగబెడతాడట..! అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సంక్షేమ పథకాల పేరుతో కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి మునుగోడులో ఒక్కొక్కరి పేరుమీద 1.40 లక్షల అప్పు చేసి చిప్ప చేతికిచ్చిన మూర్ఖుడు కేసీఆర్ అని విమ‌ర్శించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ అహంకారం తలకెక్కి మళ్లీ ఫాంహౌజ్ కే పరిమితమవుతారని.. ప్రజల కష్టాలు తెలియాలంటే ముడుగోడు ఉప ఎన్నిక గుణపాఠం అవ్వాలి.. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని తెరాస, బీజేపీ నాయకులు ఆడే నాటకాలు ఇక సాగవు అని కేఏ పాల్ అన్నారు.


Next Story