ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతూ ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇది ఎవరికీ వ్యతిరేకంగా అంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా జరగబోతున్న యాత్ర అని పాల్ నుండి సమాధానం వచ్చింది. అంతేకాకుండా కేసీఆర్ పైనా ఆయన కుటుంబం పైనా పాల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను దోచుకున్నది చాలక కేసీఆర్, ఆయన కుటుంబం దేశం మీద పడుతోందని కేఏ పాల్ ఆరోపించారు. అక్టోబర్ 2న జరగాల్సిన ప్రపంచ పీస్ ర్యాలీకి టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. పీస్ మీటింగ్ కు ప్రముఖలు వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండేదని, కానీ ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీ జాతిపిత అయితే కేసీఆర్ కూడా రాష్ట్రానికి జాతిపిత అని రాసుకోవడం సిగ్గనిపించడం లేదా అని విమర్శించారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావులు జాతీయ పార్టీ పెట్టి దేశాన్ని దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు కేసీఆర్ చేతిలో బానిసలుగా వాడబడటం బాధాకరం అని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ క్షణం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. కేసీఆర్ లో ఉన్న రావణాసురుడు చనిపోయి రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలు బాగుపడాలని తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.