కేసీఆర్ చేసిన తప్పేంటి..? : కే. కేశవరావు

K Keshava Rao Fires On BJP Govt. దుర్భరమైన పరిస్థితి తెలంగాణలో ఉందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కే. కేశవరావు

By Medi Samrat  Published on  29 Nov 2021 11:39 AM GMT
కేసీఆర్ చేసిన తప్పేంటి..? : కే. కేశవరావు

దుర్భరమైన పరిస్థితి తెలంగాణలో ఉందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కే. కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్ ఆవరణలో జ‌రిగిన ప్రెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో రెండు పంటలు పండుతాయి. రబీలో పండే వరి పంట వాతావరణ పరిస్థితుల వల్ల బాయిల్డ్ రైస్ గా చేసి కేంద్రానికి ఇస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నీరు, విద్యుత్, పెట్టుబడి సాయం, ఏ పంటలు వేయాలో అధ్యయనం చేస్తూ పంట ఉత్పత్తి సామర్ధ్యం పెంచామ‌ని తెలిపారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉందని.. ధాన్యం తీసుకోవాలని చెప్తుంటే.. మీరు ఇంత ధాన్యం ఎలా పండిస్తారని కేంద్రం అంటుందని కేశవరావు అన్నారు.

ఇది రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం అని విమ‌ర్శించారు. పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలని.. ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎంఓయు ప్రకారం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం అంటుంది. తెలంగాణ నుంచి కోటి టన్నులు ధాన్యం ఇస్తాం తీసుకోండి.. ఇది దేశానికే ప్రయోజనం. మొత్తం కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అంటే.. 80, 85 లక్షల టన్నులు అంటూ కేంద్ర మంత్రి బేరం ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు.

కేంద్రం స్పష్టత ఇస్తే పంటల మార్పిడి అంశాన్ని రైతులకు వివరిస్తామ‌ని తెలిపారు. రెండు మూడేళ్ళ సమయం ఇస్తే పంట మార్పిడి వైపు రైతులు మళ్ళుతార‌ని.. అంతవరకు బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామ‌ని తెలిపారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇందులో కేసీఆర్ చేసిన తప్పేంటి..? లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడమా? పంట ఉత్పత్తి పెంచడమా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపకూడదు? అని సూచించారు

పంజాబ్ పట్ల ఒకలా తెలంగాణా పట్ల ఒకలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంటల సేకరణలో కేంద్రం జాతీయ విధానం తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని.. పార్లమెంట్ లో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యం మాకు లేదని.. తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం చర్చ చేపట్టాలని కోరుతున్నామ‌ని కేశవరావు అన్నారు.


Next Story